పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0049-05 గుండక్రియ సం: 01-302 అధ్యాత్మ


పల్లవి:
కడుపెంత తాఁ గుడుచు కడుపెంత దీనికై
పడనిపాట్ల నెల్లఁబడి పొరలనేలా

చ.1:
పరులమనసునకు నాపదలు గలుగఁగఁజేయఁ
బరితాపకరమైనబ్రదుకేలా
సొ రిది నితరుల మేలుచూచి సైఁపఁగలేక
తిరుగుచుండేటి కష్ట దేహమిదియేలా

చ.2:
యెదిరి కెప్పుడుఁ జేయుహితమెల్లఁ దనదనుచు
చదివిచెప్పనియట్టి చదువేలా
పాదిగొన్నయాసలోఁ బుంగుడై సతతంబు
సదమదంబై పడయుచవులు దనకేలా

చ.3:
శ్రీవేంకటేశ్వరుని సేవారతికిఁగాక
జీవనభ్రాంతిఁ బడుసిరులేలా
దేవోత్తముని నాత్మఁ దెలియనొల్లక పెక్కు
త్రోవ లేఁగిన దేహి దొరతనంబేలా