పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0047-02 దేవగాంధారి సం; 01-287 అథ్యాత్మ


పల్లవి:భారమైన వేఁపమాను పాలువోసి పెంచినాను
       తీరని చేఁదేకాక తియ్యనుండీనా

చ.1:పాయఁదీసి కుక్కతోఁక బద్దలువెట్టి బిగిసి
      చాయ కెంత గట్టిగాను చక్కనుండీనా
      కాయవు వికారమిది కలకాలముఁ జెప్పినా
      పోయిన పోకలేకాక బుద్ది వినీనా

చ.2:ముంచి ముంచి నీటిలోన మూల నానఁ బెట్టుకొన్నా
      మించిన గొడ్డలి నేఁడు మెత్తనయ్యీనా
      పంచమహాపాతకాల బారిఁబడ్డ చిత్తమిది
      దంచిదంచి చెప్పినాను తాఁకి వంగీనా

చ.3:కూరిమితోఁ దేలుఁదెచ్చి కోకలోన బెట్టుకొన్నా
      సారెసారెఁ గుట్టుగాక చక్కనుండీనా
      వేరులేని మహిమల వేంకటవిభుని కృప
      ఘోరమైన ఆస మేలుకోర సోఁకీనా