పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0046-05 శ్రీరాగం సం: 01-284 అంత్యప్రాస


పల్లవి:ఎన్ని బాధలఁబెట్టి యేఁచెదవు నీవిఁక నెంతకాలముదాఁకఁ గర్మమా
       మన్నించుమనుచు నీ మఱఁగు జొచ్చితిమి మామాటాలకించవో కర్మమా

చ.1: ప్రతిలేని దురితములపాలు సేయక నన్నుఁబాలించవైతి వో కర్మమా
      తతితోడ నాత్మపరితాపంబుతోడుతను తగులేల సేసి తోకర్మమా
      జితకాలములకుఁగాని చేతికిని లోనయి చిక్క వేకాలంబు కర్మమా
      మతిహీనులైనట్టిమాకు నొకపరిపాటిమార్గంబు చూపవో కర్మమా

చ.2: ఆసలనియెడితాళ్ళ నంటగట్టుక విధికి నప్పగించితివిగదె కర్మమా
      వాసి విడిచితిమి నీవారమైతిమి మమ్ము వన్నె చెడనీకు వో కర్మమా
      కాసుకనుఁ గొరగాని గతిలేని పనికిఁగా కాలుఁదనీవేల కర్మమా
      వోసరించొకమారు వొయ్యనే వొకరీతి నొల్లనని తలఁగుమీకర్మమా

చ.3: తిరువేంకటాచలాధిపునిమాయలచేతదెసలఁదిరిగినయట్టికర్మమా
       హరిదాసులగువారి నాదరింతువుగాక అంత నొప్పింతువా కర్మమా
       వరుస నేనుగమీఁదవాని సున్నంబడుగవచ్చునా నీకిట్లఁ గర్మమా
       పరమపురుషోత్తముని భ్రమతఁబడి నీవిట్ల బట్టబయలైతిగా కర్మమా