పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు:౦౦46-03 కన్నడగౌళ సం: 01-282 ఉపమానములు



పల్లవి:ఇంత సేసెఁబో దైవ మింతలోననే అయ్యో
       సంతపాకలంంజఁ దెచ్చి సన్యాసిఁ జేసె

చ.1:పరిగెలేరేటివానిఁ బట్టపురాజుఁగా
      నిరతభోగము లిచ్చి నిలిపినట్లు
      ధరలోన నతిపాతకుని నన్ను నిట్లు
      అరయ నిత్తడిఁ దెచ్చి యపరంజిఁ జేసె

చ.2:కుక్కలవండుకతినే కులహీనునిఁ దెచ్చి
      వెక్కసఁబాఁపనిఁ గావించినయట్లు
      దిక్కులెఱఁగఁగఁ గష్టదేహిని నన్నుఁ దెచ్చి
      గక్కనఁ దెలుకపిండి కస్తూరి సేసె

చ.3:చెడుగైనదోమఁ దెచ్చి సింహపుఁగొదమఁగా
      బెడిదంప్తుఁ బ్రేమతోడఁ బెంచినయట్లు
      కడునధముని వేంకటపతి నను నిటు
      చిడిపిరాయి దెచ్చి చింతామణి సేసె