పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0౦45-02 మలహరిసం: 01-274 శరణాగతి

పల్లవి:పండియుఁ బండదు చిత్తము పరిభవ యెడయదు కాంక్షల
       యెండలనే కాఁగితి మిఁక నేలాగోకాని

చ.1:పదిగోట్లుజన్మంబులఁ బాయనికర్మపుఁ బాట్లు
      వదలక వొక నిమిషములో వడిఁదీరుచు నితఁడు
      చెదరని నిజదాసులకును శ్రీహరి, మా కిపుడంతక
      హృదయము నిలువదు చంచల మేలాగోకాని

చ.2:కూపపు బహునరకంబుల కోట్లసంఖ్యలఁ బొరలేటి-
      పాపము లొకనిమిషయములొఁ బాపఁగఁగలఁ డితఁడు
      కాపాడఁగఁ దలచిన యీకమలాపతి, నే మీతని-
      యేపునఁ గని మననే మిఁక నేలాగోకాని

చ.3:జడిగొని యెన్నఁడు బాయనిసంసారపుబంధంబుల
      విడుమని వొకనిమిషములో విడిపించును యితఁడు
      కడుఁగొలిచినవారికి వేంకటపతి, నే మీతని-
      నెడయక కొలువఁగలేమిఁక నేలాగోకాని