పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: ౦౦44-05 కన్నడగౌళ సం: 01-272 వేంకటగానం


పల్లవి:సతతవిరక్తుఁడు సంసారి గాఁడు
       రతిసమ్మదుఁడు విరక్తుఁడు నితఁడె

చ.1:నిత్యుఁడైనవాఁడు నిఖిలలోకములఁ
      బ్రత్యక్షవిభవ సంపన్నుఁడు గాఁడు
      నిత్యుఁడు నితఁడే నిరుపమానుఁడైన
      ప్రత్యక్షవిభవ సంపన్నుఁ డితఁడె

చ.2:యోగియైనవాఁడు వొనర నేకాలము
      భోగియై భోగిపై భోగింపలేఁడు
      యోగియు నితఁడే వుడుగక భోగిపై
     భోగించునటువంటి పురుషుండు నితఁడె

చ.3:దేవుడైనవాఁడుఁ దెలుప లోకముల
      దేవతారాధ్యుఁడై దీపింపలేఁడు
      దేవుఁడు నితఁడే దివిజవంద్యుఁడైన
      శ్రీవేంకటగిరిదేవుండితఁడె