పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0039-06 బౌళి-జంపెతాళం సం: 01-242 ఉపమానములు


పల్లవి:సాగియునా మఱియు ముచ్చుకుఁ బండువెన్నెలలు
       పగవానివలెనె లోపల దాఁగుఁగాక

చ.1:దక్కునా పేదకును తరముగానిధనంబు
      చిక్కి యెవ్వరికై నఁ జేరుఁగాక
      వెక్కసంబైన గోవిందునిఁ దలఁపు బుద్ధి
      తక్కిన పరులకెల్లఁ దలఁపేల కలుగు

చ.2:అరగునా దుర్భలున కరుదైన యన్నంబు
      కరుచబుద్ధులను సరమిగొనుఁగాక
      తొరలునా హరివినుతి దుష్టునకు నది నోరఁ
      దొరలెనా యతనినే దూషించుఁగాక

చ.3:చెల్లునా యమృతంబు సేవించ నధమునకు
      వొల్లనని నేలపై నొలుకుఁగాక
      వెళ్లి గొనుమందునకు వేంకటేశుస్మరణ
      చల్లనౌనా మనసు శఠియించుఁగాక