పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0004-03 శ్రీరాగం సం: 01-023 తిరుపతి క్షేత్రం
పల్లవి: అదివో అల్లదివో హరివాసము
పదివేలుశేషుల పడగల మయము
చ. 1: అదె వేంకటాచల మఖిలవున్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు-
నదె చూడుఁడదె మొక్కుఁడానంద మయము
చ. 2: చెంగట నల్లదివో శేషాచలము
నింగినున్న దేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము
చ. 3: కైవల్యపదము వేంకటనగ మదివో
శ్రీవేంకటపతికి సిరులైనది
భావింప సకలసంపద రూపమదివో
పావనములకెల్లఁ బావనమయము