పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0038-05 శ్రీరాగం సం; 01-235 అధ్యాత్మ

పల్లవి: వెఱతు వెఱతు నిండువేడుకపడ నిట్టి-
       కుఱుచబుద్దుల నెట్టు గూడుదునయ్య

చ.1: దేహమిచ్చినవానిఁ దివిరి చంపెడువాఁడు
      ద్రొహిగాక నేఁడు దొరయట
      ఆహికముగ నిట్టి అధమవ్రిత్తికి నే
      సాహమున నెట్టు చాలుదునయ్య

చ.2: తోడఁబుట్టినవాని తొడరి చంపెడువాఁడు
      చూడ దుష్టుఁడుగాక సుకృతియట
      పాడైనయిటువంటిపాపబుద్దులుసేసి
      నీడ నిలువ నెట్టు నేరుతునయ్య

చ.3: కొడుకు నున్నతమతిఁ గోరి చంపెడువాఁడు
      కడుఁబాతకుఁడుగాక ఘనుఁడట
      కడలేనియటువంటికలుషవ్రిత్తికి నాత్మ
      వొడఁబరపఁగ నెట్లోపుదునయ్య

చ.4: తల్లిఁ జంపెడువాఁడు తలఁప డుష్టుఁడుగాక
      యెల్లవారల కెల్ల నెక్కుడట
      కల్లరియనుచు లోకము రోయుపని యిది
      చెల్లఁబోనే నేనేమి సేయుదునయ్య

చ.5: యింటివేలుపు వేంకటేశ్వరుఁ దనవెంట-
      వెంటఁదిప్పెడువాఁడు విభుఁడట
      దంటనై యాతనిదాసానుదాసినై
      వొంటినుండెద నేమి నొల్ లనోయయ్య