పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0038-02 సామంతం సం: 01-232 అధ్యాత్మ


పల్లవి: నీవనఁగ నొకచోట నిలిచివుండుటలేదు
        నీవనుచుఁ గనుఁగొన్న నిజమెల్ల నీవే

చ. 1: తనయాత్మవలెనె భూతములయాతుమలెల్ల -
        ననయంబుఁ గనుఁగొన్నయతఁడే నీవు
        తనుఁగన్న తల్లిఁగా తగనితరకాంతలను
        ఆనఘఁడై మదిఁజూచునతఁడే నీవు

చ. 2: సతతసత్యవ్రతాచారసంపన్నుఁడై
        ఆతిశయంబుగ మెలఁగునతఁడే నీవు
        ధృతిదూలి ద్రవ్యంబు తృణముగా భావించు-
        హతకాముకుఁడైనయతఁడే నీవు

చ. 3: మోదమున సుఖదుఃఖములు నొక్క రీతిగా
        నాదరింపుచునున్న యతఁడే నీవు
        వేదోక్తమతియైన వేంకటాచలనాథ
        ఆదియును నంత్యంబు నంతయును నీవే