పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0036-02 ఆహిరి సం: 01-221 అధ్యాత్మ


పల్లవి:ఏమి సేయఁగవచ్చు నీశ్వరాధీనంబు
       తామసపుబుద్ధి కంతలు దూరవలసె

చ.1:తెగి దురాపేక్షఁబడ తివియ గతిలేదుగన
      పగగొన్న వగలకూపములఁ బడవలసె
      తగుమోహసలిలంబు దాఁట మతి లేదుగన
      మగుడఁబడి భవముతో మల్లాడవలసె

చ.2:పాపకర్మములఁ జంపంగ శక్తిలేదుగన
      కోపబుద్ధులచేత కొరమాలవలసె
      రూపములఁ బొడగాంచి రోయఁదరిలేదుగన
      తాపములచేఁ బొరలి తగులుగావలసె

చ.3:తిరువేంకటాచలాధిపుఁగొాలువలేదుగన
      గరిమెచెడి విషయకింకరుఁడు గావలసె
      పరతత్వమూర్తిఁ దలఁపఁగఁ బ్రొద్దులేదుగన
      దొరతనం బుడిగి యాతురుఁడు గావలసె