పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0036-01 పాడి సం: 01-220 వైరాగ్య చింత


పల్లవి: ఏడ వలపేడ మచ్చిక ఏడ సుద్దులు
       ఆడుకొన్న మాటలెల్లా నవి నిజాలా

చ.1: తొలుకారు మెఱుపులు తోచి పోవుఁగాక
      నెలకొని మింట నవి నిలిచీనా
      పాలఁతుల వలపులు పొలసిపోవుఁగాక
      కలకాలం బవి కడతేరినా

చ.2: యెండమావులు చూడ నేరులై పారుఁగాక
       అండకుఁబోవ దాహ మణఁగీనా
       నిండినట్టి మోహము నెలఁతల మదిఁ జూడ
       వుండినట్టేవుండుఁగాక వూఁతయ్యినా

చ.3: కలలోనిసిరులెల్ల కనుకూర్కులేకాక
      మెలఁకువఁ జూడ నవి మెరసీనా
      అలివేణులమేలు ఆసపాటేకాక
      తలఁపు వేంకటపతిఁ దగిలీనా