పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0035-05 ఆహిరి సం: 01-218 వైరాగ్య చింత

పల్లవి: ఏమి గలిగెను మా కిందువలన
       వేమారుఁ బొరలితిమి వెఱ్ఱిగొన్నట్లు

చ.1: తటతటన నీటిమీఁదట నాలజాలంబు-
      లిటునటుఁ జరించవా యీఁది యీఁది
      అటువలెనెపో తమకమంది సంసారంపు-
      ఘటనకై తిరిగితిమి కడ గానలేక

చ.2: దట్టముగఁ బారావతముల మిన్నుల మోవ
      కొట్టఁగొన కెక్కవా కూడి కూడి
      వట్టియాసలనే యిటువలెనేపో యిన్నాళ్ళు
      బట్ట బయ లీఁదితిమి పనిలేనిపాట

చ.3:బెరసి కుమ్మరపురువు పేఁడలోపలనెల్ల
      పారలదా పలుమారుఁ బోయిపోయి
      వరుస జన్మముల నటువలెనె పొరలితిమి
      తిరువేంకటాచలాధిపుఁ దలఁచలేక