పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0035-02 ఆహిరి సం: 01-215 వైరాగ్య చింత

పల్లవి:ఇందునందుఁ దిరుగుచు నెవ్వరివాఁడవుగాక
       బందెపసురమవైతి బాపు జీవుఁడా

చ.1: తోలుబొక్కలోనఁ జొచ్చి తూలేటిఁయాకలిచేత
      పాలుమాలి యిందరికి బంటుబంటవై
      యేలినవానిఁ గానక యేచినయాసల వెంట
      కూలికిఁబో దొరకొంటి కూళజీవుఁడా

చ.2: తీఁటమేనిలోనఁ జొచ్చి దిమ్మరిదొంగలచేత
      మూఁటగట్టించుక నీవు మూలదొరవై
      గాఁటపువిభునిచేతిఘనత కోరికలకు
      వేఁటకుక్కవైతివి వెట్టిజీవుఁడా

చ.3:చీమలింటిలోనఁ జొచ్చి చిక్కువడి అందరిలో
      దోమకరకుట్లకు తోడిదొంగవై
      యేమరి వేంకటవిభు నెఱఁగక జాడుఁజొప్ప
      నాము మేయ దొరకొంటి నాలిజీవుఁడా