పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0027-06 సాళంగనాట సం: 01-167 అధ్యాత్మ


పల్లవి :

వాసివంతు విడిచినవాఁడే; యోగి యీ-
అసలెల్లా విడిచిన అతఁడే యోగి


చ. 1:

గద్దించి పారెడుతురగమువంటి మనసు
వద్దని మరలించినవాఁడే యోగి
వొద్దనే కొండలవంటి వున్నత దేహగుణాలు
దిద్ది మట్టుపెట్టువాఁడే ధీరుఁడైన యోగి


చ. 2:

ముంచుకొన్న యింద్రియపు మోహజలధిలోన
వంచన మునుఁగనట్టివాఁడే యోగి
పొంచి పుణ్యపాపములు పొట్టువంటి కర్మములు
దంచి పారఁజల్లువాఁడే తత్త్వమైన యోగి


చ. 3:

వెగటుకామాదుల వెళ్ళఁగొట్టి శాంతుఁడై
వగలుడిగినయట్టివాఁడే యోగి
నిగిడి శ్రీవేంకటపతి నిజదాసుఁడై భక్తిఁ
దగిలి నిలుపువాఁడే ధన్యుఁడైన యోగి