పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0027-05 ఆహిరి సం: 01-166 కృష్ణ


పల్లవి :

ఇన్ని లాగులచేతు లివియపో కడు-
నెన్నిక కెక్కినచేతు లివియపో


చ. 1:

గునియుచుఁ దనునెత్తుకొమ్మని తల్లిపై-
నెనయఁ జాఁచినచేతు లివియపో
కినిసి గోవర్ధనగిరి వెల్లగించిన-
యునుమువంటి చేతు లివియపో


చ. 2:

పిసికి పూతకిచన్ను బిగియించిపట్టిన౼
యిసుమంతలు చేతు లివియపో
పసులఁ గాచుచు గొల్లపడుచుల యమునలో
యిసుక చల్లినచేతు లివియపో


చ. 3:

పరమచైతన్యమై ప్రాణుల కెల్లను
యెరవులిచ్చినచేతు లివియపో
తిరువేంకటగిరి దేవుఁడై ముక్తికి-
నిరవు చూపెడుచేతు లివియపో