పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0026-03 ముఖారి సం: 01-158 శరణాగతి


పల్లవి :

ఆఁకటివేళల నలపైన వేళలను
తేఁకువ హరినామమే దిక్కు మఱిలేదు


చ. 1:

కొఱమాలి వున్నవేళ కులము చెడినవేళ
చెఱఁవొడి వొరులచేఁ జిక్కినవేళ
వొఱపైన హరినామ మొక్కటే గతిగాక
మఱచి తప్పిననైన మఱిలేదు తెరఁగు


చ. 2:

ఆపద వచ్చినవేళ యారడిఁబడినవేళ
పాపపు వేళల భయపడినవేళ
వోపినంత హరినామ మొక్కటే గతిగాక
మాపుదాఁకాఁ బొరలిన మరిలేదు తెఱఁగు


చ. 3:

సంకెళఁ బెట్టినవేళ చంపఁ బిలిచిన వేళ
అంకిలిగా నప్పులవారాఁగిన వేళ
వేంకటేశునామమే విడిపించ గతిగాక
మంకుబుద్ధిఁ బొరలిన మరిలేదు తెఱఁగు