పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0024-05 వరాళి సం: 01-147 వైరాగ్య చింత


పల్లవి :

చిత్త మతిచంచలము చేఁత బలవంతంబు
తిత్తిలో జీవుఁ డిటు దిరిగాడుఁ గాక


చ. 1:

కదిసి జీవుఁడు పుట్టఁగాఁ బుట్టినటువంటి
మొదలుఁ దుదయును లేని మోహపాశములు
వదలు టెటువలెఁ దారు వదలించు టెటువలెను
పదిలముగ వీనిచేఁ బడి పొరలుఁ గాక


చ. 2:

కడలేని జన్మసంగ్రహములై యెన్నఁడును
గడుగ వసములు గాని కర్మవంకములు
విడుచు టెటువలెఁ దారు విడిపించు టెటువలెను
విడువనివిలాపమున వేఁగుటలు గాక


చ. 3:

యిందులోపల జీవుఁ డెన్నఁడే నొకమాటు
కందు వెఱిఁగి వివేకగతులభాగ్యమున
అందముగఁ దిరువేంకటాద్రీశు సేవించి
అందరాని సుఖంబు లందుఁ గాక