పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0024-04 శ్రీరాగం సం: 01-146 వైరాగ్య చింత


పల్లవి :

వలపులధికము సేయు వైభవములు
తలఁపు లధికము సేయుఁ దలపోఁతలు


చ. 1:

కోపమధికము సేయుఁ గోరికలు
తాప మధికము సేయు దమకంబులు
కోపంబుఁ దాపంబుఁ గూడ నధికము సేయు
యేపయిన మోహముల నేమందమే


చ. 2:

మచ్చికధికము సేయు మన్ననలు
యిచ్చ లధికము సేయు నీరసములు
మచ్చికలు నిచ్చలును మగుడ నధికము సేయు-
నెచ్చరిక కూటముల నేమందమే


చ. 3:

అందమధికము సేయుఁ నైక్యములు
పొందులధికము సేయుఁ బొలయలుకలు
అందములుఁ బొందులును నలరనధికముసేయు-
నెందు నరుఁదగు వేంకటేశు కృపలు