పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0024-02 సామంతం సం: 01-144 వైష్ణవ భక్తి


పల్లవి :

సులభమా మనుజులకు హరిభక్తి
వలనొంది మరికదా వైష్ణవుఁడౌట


చ. 1:

కొదలేని తపములు కోటానఁగోటులు
నదన నాచరించి యటమీఁద
పదిలమైన కర్మబంధము లన్నియు
వదలించు కొనికదా వైష్ణవుఁడౌట


చ. 2:

తనివోని యాగతంత్రములు లక్షలసంఖ్య
అనఘుఁడై చేసినయట మీద
జననములన్నిట జనియించి పరమపా-
వనుఁడై మరికదా వైష్ణవుఁడౌట


చ. 3:

తిరిగితిరిగి పెక్కు తీర్ధములన్నియు -
నరలేక సేవించినట మీఁద
తిరువేంకటాచలాధిపుఁడైన కరిరాజ
వరదుని కృపఁగదా వైష్ణవుఁడౌట