పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0024-01 వరాళి సం: 01-143 అధ్యాత్మ


పల్లవి :

ఆపదల సంపదల నలయు టేమిట మాను
రూపింప నిన్నిటను రోసిననుఁ గాక


చ. 1:

కడలేనిదేహరోగంబు లేమిట మాను
జడనువిడిపించునౌషధసేవఁగాక
విడవ కడియాస తను వేఁచు టేమిట మాను
వొడలికలగుణమెల్ల నుడిగిననుఁగాక


చ. 2:

దురితసంగ్రహమైన దుఃఖ మేమిట మాను
సరిలేని సౌఖ్యంబు చవిగొన్నఁగాక
కరుకైన మోహంధకార మేమిట మాను
ఆరిది తేజోమార్గ మలవడినఁగాక


చ. 3:

చావులోఁ బెనగొన్నజన్మ మేమిట మాను
యీవలావలి కర్మ మెడసినఁ గాక
భావింప నరుదైనబంధ మేమిట మాను
శ్రీ వేంకటేశ్వరుని సేవచేఁ గాక