పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0002-05 మాళవిశ్రీ సం: 01-011 భక్తి
పల్లవి: ఇందుకొరకె యిందరును నిట్లయిరి
కిందుపడి మఱికాని గెలుపెఱఁగరాదు
చ. 1: అటమటపువేడుకల నలయించి మఱికదా
ఘటియించుఁ బరము తటుకన దైవము
ఇటు సేయ నీశ్వరున కీసు గలదా? లేదు.
కుటిలమతిఁ గని కాని గుణిఁ గానరాదు
చ. 2: బెండుపడ నవగతులఁ బెనఁగించి మఱికదా
కొండనుచుఁ బర మొసంగును దైవము
బండుసేయఁగ హరికి బంతమా? యటుగాదు.
యెండదాఁకక నీడహిత వెఱఁగరాదు
చ. 3: మునుప వేల్పులకెల్ల మ్రొక్కించి మఱికదా
తనభ క్తి యొసఁగు నంతట దైవము
ఘనవేంకటేశునకు గపటమా? అటుగాదు.
తినక చేఁదునుఁ దీపు తెలియనేరాదు.