పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0019-01 ఆహిరి సం: 01-113 వైరాగ్య చింత


పల్లవి :

ఎన్నాళ్ళదాఁకఁ దానిట్టె వుండుట బుద్ది
కన్న పోవుట పూర్వకర్మ శేషం


చ. 1:

కలకాలమెల్ల దుఃఖ మెకాఁగఁ బ్రాణికిని
వలదా సుఖము గొంతవడియైనను
కలుషబుద్దులఁ బ్రజ్ఞగల దింతయును మంటఁ
గలసిపోవుటే పూర్వకర్మ శేషం


చ. 2:

జాలి తొల్లియుఁబడ్డజాలె నేఁడునుఁగాక
మేలు వొద్దా యేమిటినై నాను
తాలిమి లో హరిఁ దలఁచక యెఱుకెల్ల
గాలిఁబోవుట పూర్వకర్మశేషం


చ. 3:

తరగని నరకబాధయు నేఁడునుగాక
దరి చేరవలదా యింతటనైనను
తిరువేంకటాద్రిపై దేవునిఁ గొలువక
గరిపడే భవమెల్ల కర్మశేషం