పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0018-06 శ్రీరాగం సం: 01-112 వైరాగ్య చింత


పల్లవి :

ఏమి గలదిందు నెంత గాలంబైన
పామరపు భోగ మాపదవంటి దరయ


చ. 1:

కొండవంటిది యాస, గోడ వంటిది తగులు
బెండువంటిది లోని పెద్దతనము
పుండువంటిది మేను, పోలించినను మేడి
పండువంటిది సరసభావమింతియును


చ. 2:

కంచువంటిది మనసు, కలిమిగలదింతియును
మంచువంటిది, రతి భ్రమతవంటిది
మించువంటిది రూపు, మెలింతియును ముట్టు
పెంచువంటిది, దీనిప్రియ మేమిభ్రాఁతి


చ. 3:

ఆఁకవంటిది జన్మ, మడవివంటిది చింత
పాఁకువంటిది కర్మ బంధమెల్ల
యేఁకటను దిరువేంకటేశుఁ దలచినకోర్కి
కాఁక సౌఖ్యములున్న గనివంటి దరయ