పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0018-02 గుజ్జరి సం: 01-108 వేంకటగానం


పల్లవి :

నాపాలి ఘన నిధామవు నీవే నన్ను
నీ పాల నిడుకొంటి నీవే నీవే


చ. 1:

ఒలిసి నన్నేలె దేవుఁడవు నీవే, యెందుఁ
దొలగని నిజబంధుఁడవు నీవే
పలుసుఖమిచ్చేసంపదవునీవే, యిట్టే
వెలయ నిన్నియును నీవే నీవే


చ. 2:

పొదిగి పాయని యాప్తుఁడవు నీవే, నాకు
నదనఁ దోడగుదేహమవు నీవే
మదమువాపెడి నామతియు నీవే, నాకు
వెదక నన్నియును నీవే నీవే


చ. 3:

యింకా లోకములకు నెప్పుడు నీవే, యీ
పంకజభవాదిదేవపతివి నీవే
అంకలి వాపఁగ సంతకు నీవే తిరు-
వేంకటేశ్వరుఁడవు నీవే నీవే