పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0017-06 లలిత సం: 01-106 వైరాగ్య చింత


పల్లవి :

ఎక్కడి దురవస్థ లేఁటిదేహము లోనఁ
జిక్కి జీవుఁడు మోక్షసిరిఁ జెందలేఁడు


చ. 1:

ఒడలు మంసపూర మొక పూఁటయిన మీఁదు
గడుగకున్నఁ గొరగాదు
కడలేనిమలమూత్రగర్హిత మిది, లోను
గడుగరాదు యెంతగడిగినఁ బోదు


చ. 2:

అలర చిత్తము చూడ నతిచంచలము దీనఁ
గలసిన పెనుగాలి గనము
మెలుపులేనిచిచ్చు మీఁదమిక్కిలిఁ గొంత
నిలుపు లేదు పట్టి నిలుపఁగరాదు


చ. 3:

తిరువేంకటాచలాధిపుఁడు నిత్యానంద-
కరుఁడు జీవునకు రక్షకుఁడు
కరుణించి యొకవేళఁ గాచినఁగాని మేను-
చొరకమానెడు బుద్ది చోఁక దెవ్వరికి