పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

యవ్వనమందు నాథులకు నింతులు [1]మేలుపచార మేర్పడన్
నివ్వటిలంగఁ జేతురు, త్రిణేత్రుని వీడని భక్తి నుందు; రా
యవ్వనమంతఁ బోవ, మఱి యింతులు నాథుల లెక్కసేయకన్
క్రొవ్విన మాట లండ్రు; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

64

భావం:

దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనరసింహదేవా! మహానుభావా! సాధారణంగా ఈ లోకమందలి గృహిణులయొక్క స్వభావాన్ని విన్నవిస్తున్నాను, చిత్తగించు! యౌవనదశలో నున్న యువతులు తమ భర్తలను శివుణ్ణి చూసినంత పూజ్యభావంతో చూస్తూ వారికి భక్తిశ్రద్ధలతో పరిచర్యలు చేస్తూవుంటారు. కాలక్రమేణ ఆయౌవనం గడచిపోయిన పిదప, ఆ యింతులు గర్వించినవారై, పతులను లక్ష్యపెట్టక, దురుసుగా మాట్లాడుతూవుంటారు. (కనుక, ఇంతులు పతులయెడ ప్రదర్శించే సేవాతత్పరత చాలవరకు తాత్కాలికమైనదే యని గుర్తించి, మనుజుడు ముక్తిలక్ష్యాన్ని మరువక మసలుకోవలెనని సందేశం).

  1. 'మేలు+ఉపచారము' అని పదవిభజనము