పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

మూఁడు గుణాలు మానకను, ముందర నుండెడి మూర్తిఁ గానకన్,
బూడిద మేనఁ బూసి, బహుబూటకముల్ పయినేసి, ధాత్రిపై
వాడక సంచరించుచును [1]వాసగు వస్తువుఁ గానకుండినన్
కూడదు ముక్తికాంత; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

56

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనరసింహదేవా! స్వామీ! అవధరించు! సత్త్వగుణం, రజోగుణం, తమోగుణం - అనే త్రిగుణాలలో చిక్కుకొని వుండి, వాటిని అదుపు చేయజాలనందున, ఎదుట గోచరించే దివ్యమైన) ఆత్మస్వరూపాన్ని కనలేక, ఒళ్లంతా బూడిద పూసికొని, ఆడంబరాన్ని సూచించే బాహ్యవేషాన్ని ధరించి, ఉత్కృష్టమైన ఆత్మతత్త్వాన్ని దర్శింపకుండానే, ఊరక ఈ లోకంలో సంచరిస్తూవుండే బూటకాలరాయుణ్ణి ముక్తికాంత కూడదు (కలిసికొనదు) కదా!

  1. 'వాసి+అగు’- అని పదవిభాగము