పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

చూడు మహానుభావ! యొకచోద్యపుజీవుఁడు దేహకాంక్షలన్
వీడఁ, డవెన్ని చెప్పిన వివేకము గల్గదు, ఎంత మత్తుఁడో?
రాఁడు దురాశలన్ విడిచి, ప్రాకృతుభంగిని నింద్రియాలతో
[1]గూడెడఁబాయలేఁడు; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

30

భావం:

దయాసముద్రుడవైన శ్రీ తరిగొండ లక్ష్మీనరసింహదేవా! మహానుభావా! ఇటుచూడు! విచిత్రస్వభావంగల ఈ జీవుడు దేహంమీది మమకారాన్ని విడువకున్నాడు. ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా వీనికి వివేకం కలగటం లేదు. నిజంగా వీడు ఎంత మదించినవాడో కదా! దురాశలను విడిచిపెట్టి రానే రాడు. శుద్ధపామరునిలాగా ఇంద్రియాలతో ఎడబాయని రీతిలో కలసిమెలసియుంటున్నాడు. (ఇట్టి అవివేకిని సమర్థుడవైన నీవే సముద్ధరింపగలవు స్వామీ!)

  1. 'కూడి+ఎడఁబాయలేఁడు' అని పదవిభాగము.