పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

[1]పాటగు నన్నమున్ విడిచి పత్రము లెప్పుడు మేయనేల? బల్
ఏటికిఁ గట్ట వేసినను నెన్ని దినంబులు నిల్చుఁ దోయముల్?
బూటకమంతె కాదె? మఱి పొందుగ జన్మము లెత్తుటెల్ల నీ
కూటికిఁ గాదె? స్వామి! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

88

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనరసింహదేవా! అవధరించు! అనువయిన ఆహారాన్ని విడిచిపెట్టి, మనుజుడు (తపస్సు పేరిట) ఆకులు భక్షించడం దేనికి? నిరంతరం వేగంగా ప్రవహిస్తూవుండే జీవనదికి కట్టను వేస్తే, అలాంటి కట్టవల్ల నీళ్లు ఎన్నాళ్లు నిలిచివుంటాయి? అలాగే, ఆకులు మేయడం కూడా ఒకవిధంగా బూటకమైనదే (తాత్కాలికమైనదే) కదా! మఱి ఈ జీవుడు పదే పదే జన్మ లెత్తుతూవుండటం కూడా ఆకూటి కొరకే గదా? స్వామీ! (కాబట్టి, కపటమైన ఆచరణకన్నా, మనస్సును నిలుపడం ముఖ్యమనేది సారాంశం.)

  1. 'పాటి + అగు' అని పదవిభాగము