పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

ప్రజలకు ఏది ఇష్టమో దానిని నా అభీదష్టంగా భావిస్తాను...నా ప్రజలకు ఎవరు శత్రువులో వారు నాకూ శత్రువులు. నా ప్రజలతో ఎవరు కలహిస్తారో, వారు నాతో యుద్ధం ప్రకటించినట్లే' అని స్పష్టం చేసిన టిపూ చివరి వరకు ఆ మాటను పాటించారు. నిజాం నవాబు, మరాఠాలను నిత్యం ఎదుర్కొంటూ తన రాజ్యాన్ని ఉత్తరాన కృష్ణానది నుంచి, దక్షిణాన దిండిగల్‌ వరకు అంటే సుమారు 400 మైళ్ళ పొడవున, పశ్చిమాన మలబారు నుంచి, తూర్పున తూర్పు కనుమల వరకు సుమారు 300 మైళ్ళు విస్తరింప చేశారు. టిపూ మొదటి రెండు మైసూరు యుద్ధాలలో తండ్రి మార్గదర్శకత్వంలో పాల్గొనగా ఆ తరువాత ఆయన 17 సంవత్సరాల పాటు సాగించిన పరిపాలన కాలంలో జరిగిన చివరి మూడవ, నాల్గవ మైసూరు యుద్ధాలలో స్వయంగా పాల్గొన్నారు.

ఆధునిక వ్యాపార, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను టిపూ బహుదా ప్రోత్సహించారు. నీిటి పారుదల సౌకర్యం కల్పించేందుకు అధిక శ్రద్ధ వహించారు. పన్ను వసూలుకు నూతన పద్దతులు ప్రవేశపెట్టారు. చిన్న చిన్న నేరాలను చేసినవార్ని సంఘ ప్రయోజనాలకు పనికొచ్చేలా వినూత్న శిక్షలు విధించారు. కన్నడ, తెలుగు, మరాఠి, అరబ్బీ, పర్షియన్‌, ఉర్దూ, ఫ్రెంచ్‌, భాషలను నేర్చుకున్నఆయన విద్యావ్యాప్తి కోసం చాలా కృషి సల్పారు. విశ్వవిద్యాలయం ఏర్పాటును ఆకాంక్షించారు. మంచి చదువరి అయిన టిపూ తన సైన్యం కోసం Fauji Akhbar అను వారపత్రికను నిర్వహించారు. టిపూ స్వమతం పట్ల అభిమానం గల ప్రభువు తప్ప, మత దురభిమాని కాదు. రాజ్య పాలనా వ్యవహారాలలో ఆయన మతాతీతంగా వ్యవహరించారు. మసీదు-మందిరాల మధ్యాగాని, హిందూ-ముస్లింల మధ్యగాని ఏమాత్రం తేడా చూపించ లేదు.

టిపూ ఔన్నత్యాన్నిచూసి అసూయా ద్వేషాలతో రగిలి పోతున్ననిజాం నవాబు, మరాఠాలు టిపూకు వ్యతిరేకంగా ఏకం కావటమే కాక కంపెనీ పాలకులతో చేతులు కలిపి భారీ బలగాలతో 1799 మే4 ఉదయం శ్రీరంగపట్నం పైన విరుచుకపడ్డారు. టిపూ తన బలగాలతో శత్రువు మీద విక్రమించినా, టిపూ దివాన్‌ మీ సాధిక్‌ ఆంగ్లేయు లతో చేతులు కలిపి కోటలోకి శతృసైన్యాలు సునాయాసంగా ప్రవేశించడానికి దారి చూపాడు. ఈ విషయాన్ని టిపూ గ్రహించేలోగా పరిస్థితులు చేతులు దాటిపోయాయి. 'నక్కలాగా వంద సంవత్సరాలు బ్రతికే కంటే సింహంలా ఒక్క రోజు బ్రతికినాచాలు' అని గర్జిస్తూ టిపూ శత్రుసైన్యాల మీద విరుచుకుపడ్డారు. ఆ పోరాటంలో తీవ్రంగా గాయపడి సొమ్మసిల్లిన టిపూను ఆంగ్ల సైనికుడొకడు తుపాకితో కాల్చటంతో ఆంగ్లేయులను టిపూ భయకంపితుల్ని గావించిన టిపూ సుల్తాన్‌ 1799 మే4 న కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌