Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

ఈవిశేషంబు విరివిగా నెఱుఁగఁ జెప్పి
చెవులపండువు సేయు మచ్చిక దలిర్ప
మునివరేణ్య భవద్వాక్యజనితమధుర
సుధ గదా నన్ను నేఁడు విబుధుఁగఁ జేయు.

43


వ.

అనవుడు నిలావంతునకు శుకయోగీంద్రుం డి ట్లనియె.

44


తే.

అనఘ మేలైనయది నన్ను నడిగి తీవు
వినెడువారికిఁ జెప్పెడుఘనమతులకు
నఖిలపాతకహారియు నభిమతార్థ
దాయకము నగు తచ్చరిత్రంబు వినుము.

45


చ.

కలఁడు మహాత్ముఁ డొక్కఁడు సుఖంబులు దుఃఖములు స్సమంబుగా
మెలఁగి సుహృజ్జనంబులు నమిత్రులు నేకవిధంబుగాఁ జెలం
గి లలితలోచనాతతి మృగీసమితి న్సరిగాఁ దలంచువాఁ
డిలపయిఁ [1]దుల్యభావనయు నిట్లు భజించుటఁ దుల్యమౌనినాన్.

46


చ.

అలఘుతపోవిశేషమున నంబుజగర్భునితోడ శాంతి మై
సలినదళాక్షుతోడ భువనస్తుతభూతహితప్రబుద్ధిచే
నల గిరిజేశుతోడ మహిమాతిశయంబున వ్యాసుతోడ నీ
తుల గురుతోడఁ దుల్యుఁడనఁ దుల్యుఁడు మించె ధరాతలంబునన్.

47


తే.

అతఁడు పరమాత్ముఁ గూర్చి బాహ్యమును లోను
నేకముగఁ జేసి లోకంబులెల్లఁ బొగడ
భూరిభాగీరథీనదీతీరమునను
విమలమతితోడఁ దపముఁ గావించుచుండె.

48
  1. దుల్యభాగ యనునేట జనించిన తుల్యమాని