పుట:చారుచర్య (అప్పకవి).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

చారుచర్య


క.

కుడిచిన పిమ్మటఁ జేతులు
తుడిచి నియతి వార్చి మధనతోయము నియతిన్
బిడిచికొనవలయుఁ గన్నులఁ
బొడమఁగరా దక్షిరోగముల కట్లైనన్.

44


క.

దళముగఁ గ్రోలుచు నుండిన
జల మేమియు నాన కున్న జఠరము శిఖి దు
ర్బల మగు నన్నం బఱుగదు
పలుమఱు నగు నల్పవారి పానము సేయన్.

45


సీ.

కఠినమై దొడ్డచిక్కణమునై వత్సరా
                ర్థంబు వోయిన ప్రాఁతదనము గలిగి
యుజ్జ్వలచ్ఛాయమై నొత్తిన తరువాయి
                శశమాంసఖండంబుచంద మగుచు
నొగరించుకయులేక మిగులంగఁ దీపైన
                క్రముకంబు లెఱ్ఱనై కమ్మ వలచి
దళ మెక్కి పండిన తాంబూలదళములు
                కాలోపలంబులు కాల్చి వడియఁ


గీ.

గట్టినటువంటిచూర్ణంబుగా నొనర్చి
భుక్తి ముందర నాలుగుభోజనోత్త
రమున రెండును నటమీఁద రాత్రి నాఱు
మార్లు తాంబూల మొప్పారు మంత్రి యప్ప.

46


సీ.

పోఁకకు మూఁటి చొప్పునఁ బర్ణములు గూర్చి
                తగుఁ జేయ రేపటి తమ్ములములు
నాలుగు నైదులు నోలిన కొలఁది మ
                ధ్యాహ్ననిశీధినీసమయములను