పుట:చారుచర్య (అప్పకవి).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చారుచర్య

31


తే.

దప్పి కుదకంబు మాఱుకూ డొప్పఁ గొనగ
క్షుధకుఁ గూటి మాఱుగ నీరు గ్రోలఁ జనదు
గుల్మ మగు భగందరమునం గురువు పుట్టుఁ
జెలఁగి యీరెండు నేరక చేసిరేని.

38


తే.

కుడువఁ దొణఁగుచు నీళ్లను గ్రోలెనేని
దీపనము చెడుఁ దద్దయు దేహ మఱుగు
భుక్తిమధ్యోదకము కొంత పుష్టి సేయుఁ
బిదపఁ బానీయ మానుట పెద్ద మేలు.

39


తే.

కడుపు నాలుగుపాళ్లనుగా నెఱింగి
రెండుపా ళ్లన్నమునను బూరింపవలయుఁ
బానమున నింపఁగా నొకపాలు వలయు
వాయుచలనకు నొకపాలు వలయు నెడము.

40


తే.

కుడిచినప్పుడఁ శయనింపఁ గడుపు పెరుగు
కదలక కెచ్చోటఁ గూర్చున్నఁ గలుగుసుఖము
అల్ల నడయాడ నాయువు నగ్గలించు
దూర మరిగిన మృత్యువు దోన యరుగు.

41


క.

కడుపు కడుఁబిక్కటిల్లినఁ
బొడమును మఱి దప్పి హీనభోజనుఁ డైనన్
బడుగగుఁ గావున సమమగు
కుడుపున నేతెవులు లేక కొలఁదియొడ లగున్.

42


క.

కుడుచు నతం డైనను బె
ట్టెడు నాతం డైన నపుడు డెందము రెండై
కడుఁగోపముతో నుండినఁ
గుడిచినయన్నంబు కాలకూటముఁ బోలున్.

43