పుట:చంద్రాలోకము.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్యాఘాతాలంకారము

గీ.

ఒక్కవిధమైనదాన వేఱొక్కపనికి
సర్వముగఁ జేయ వ్యాఘాత మండ్రు దాని
నెవ్వి జగమున కింపగు నవ్వు హింస
సలువ కరణములుగఁ బంచశరుఁ డొనర్చె.

108


గీ.

అభిమత నిమిత్తమని పల్కునదె విరుద్ధ
మైన నదియును వ్యాఘాత మండ్రు బుధులు
నేను బాలుఁడ నని దయ నీకుఁ గలిగె
నేని నను విడనాడుట యెట్లు గూడు.

109

కారణమాలాలంకారము

గీ.

వరుస దప్పని కారణావళులతోడఁ
గీలు కొల్పినఁ గారణమాల యగును
నీతిచే సిరి సిరిచేత దాతృతయును
దాతృతను భూరియశ మన్నరీతి శర్వ.

110


క.

నరకములు పాపమునఁ జే
కుఱుఁ బాపము లేమిచే నగును లేమి పరి
స్ఫురణం బీకుండుటచేఁ
బరఁగు నటులుగాన దానపరుఁడవు గమ్మా.

111

ఏకావళ్యలంకారము

గీ.

అలరును గృహీతముక్తరీత్యర్థపంక్తి
యగుచు నేకావళి యనంగ నఖిలకృతుల
దీనికి వచింతు లక్ష్యంబు దెలియ వినుము
శైలజానాథ! ప్రమథసంచయసనాథ!

112


గీ.

కన్ను లాశ్రవణాంతదీర్ఘములు శ్రవణ
ములు భుజనికాయభావితంబులు భుజములు
జానులంబముల్ జానువు ల్చారుముకుర
సదృశములు చోళ వసుమతీశ్వరున కనఁగ.

113

మాలాదీపకాలంకారము

గీ.

దీపకైకావళీసంగతిం దనర్చి
ఖ్యాతి కెక్కు మాలాదీపకం బనంగ
స్మరుఁడు వసియించెఁ దన్మానసమున దాని
మనసు నీయందు వర్తించె నను విధమున.

114