Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

విఱిగె ధర జరిగె నుడుతతు, లొఱగె నభం బరిగె వార్ధు లూటాడె గిరుల్
వెఱచె జగ మఱచె దిశ ల, త్తఱి వారలరోషగద్గదధ్వానములన్.

32


ఉ.

గ్రక్కున లేచి యంపసెలగల్ దగు పెన్పొదులూని సింగిణీ
లెక్కిడి చేత నాలుగయి దేర్చినతూపులు సంతరించి నల్
ప్రక్కలఁ జూచుచుం గలకలం బుదయించినత్రోవ నిల్చి యా
దిక్కునఁ బాఱుసంయములు దెల్ప నశేషము నాలకించుచున్.

33


మ.

చని యగ్రావని వారు గాంచిరి జటాసంచ్ఛన్న[1]సర్వాంగులన్
జనితేర్ష్యావశులన్ మిథశ్శపనదిత్సాప్రస్ఖలద్వాక్యులం
గనదాలోకవికీర్ణపావకుల హుంకారోర్జితాన్యోన్యత
ర్జనులన్ భ్రూకుటిభీకరాకృతులఁ బారాశర్యదుర్వాసులన్.

34


[2]క.

కాంచి ప్రదక్షిణవిధు ల, త్యంచితగతి నాచరించి సాష్టాంగము ల
ర్పించి యలమునుల వారు ను, తించిరి గంభీరభారతీగుంభనలన్.

35


సీ.

శౌరిపాదాబ్జసంసక్తాయ ముక్తాయ సోమచూడారత్నసోదరాయ
సకలపురాణప్రశంసాయ హంసాయ బలభేదిగర్వవిభంజనాయ
సత్యవతీగర్భజాతాయ పూతాయ కర్దమజానందకందలాయ
శ్రీవసిష్ఠకులప్రసిద్ధాయ శుద్ధాయ శాంభవతేజోంశసంభవాయ
నతిరమర్త్యనుతాయసువ్రతిహితాయ, నతిరవార్యనవార్యమద్యుతియుతాయ
నతిరతివివిక్తతనయాయతతనయాయ, నతిరశేషవిశేషమత్యతిశయాయ.

36


క.

అని యిరువురఁ బొగడిన నం, దనసూయసుతుండు శాంతుఁడై నిజశాపో
క్తినిశాతశూలకృతశా, తనుల యదూద్వహులఁ జూచి దయతోఁ బలికెన్.

37


ఉ.

మీ రొకయేఁడు జో డెడసి మీఁదటఁ గుండిన[3]పట్టనేందిరా
గారములోన నొండొకని గన్గొని వాంఛితవైభవంబు చే
కూరిన నింపుసొం పెసఁగ గోపవధూపతితోడఁ గూడి మీ
ద్వారావతీపురంబునకు వత్తురుగాని తలంక నేటికిన్.

38


క.

అని పలికిన దుర్వాసో, మునిచేఁ బనివిని దయాసమున్నతు వ్యాసుం
గని పునరవనతి సలిపిన, ననుపమవాత్సల్యగరిమ నతఁ డి ట్లనియెన్.

39
  1. క - దివ్యాంగులన్
  2. ట-లో దీనితోఁ బై మూఁడుపద్యములకు మాఱు "చూచి ప్రదక్షిణనమస్కారంబు లర్పించి యున్నం జూచి యనసూయాసుతుండు దయార్ద్రచిత్తుండై” యనువచనము గలదు.
  3. చ-పట్టనామరా