Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామరాజు మృతినొందెను. పిదపఁ దిరుమలరాయలు సదాశివదేవరాయని ముఖ్యమంత్రిగ నుండి క్రీ. 1570-వ సంవత్సరప్రాంతమందు సదాశివదేవరాయలు మరణింపఁగాఁ దా నారాజ్యము నాక్రమించుకొని రా జయ్యెను. క్రీ. 1574-వ సంవత్సరములోఁ దిరుమలరాయని ద్వితీయపుత్రుఁడు రా జయినట్లు శాసనములవలనఁ గనఁబడుచున్నది. కావునఁ దిరుమలరాయలు మూఁడుసంవత్సరములకంటె నెక్కువకాలము రాజ్యము చేసిన ట్లగపడదు. తాళికోటయుద్ధానంతరము తురుష్కులు కర్ణాటరాజధాని యైనవిజయనగరముపై దండెత్తి వచ్చి యానగరమును బాడుచేసి యుండుటచేఁ దిరుమలరాయలు, అనంతపురమండలములోని పెనుగొండను దనరాజధానిగాఁ జేసికొనియెను. తిరుమలరాయనికి రఘునాథరాయలు, శ్రీరంగరాయలు, రామరాయలు, వేంకటపతిరాయలు నని నలుగురు కొడుకు లుండిరి. రఘునాథరాయలును రామరాయలును రాజ్యము చేసినట్లు కనఁబడదు. తిరుమలరాయలపిదప శ్రీరంగరాయలును నాతనితరువాత వేంకటపతిరాయలును రాజు లయిరి. శ్రీరంగరాయల రాజ్యకాలములో విజాపురపుఁ దురుష్కరాజులు పెనుగొండ నాక్రమించుకొనుటచేఁ చిత్తూరుజిల్లాలోని చంద్రగిరి కర్ణాటరాజ్యరాజధాని యయ్యెను. వేంకటపతిరాయలు రాజ్యమునకు వచ్చినప్పటి కిదియే రాజధానిగా నుండెను గాని,

"తనకు వేలూరు వరరాజధాని గాఁగ, వీరవేంకటపతిరాయవిభుఁడు మిగుల
ధరణిఁ బాలించె ధర్మతత్పరతఁ జెలఁగి"

అనురామరాజీయపద్యమును బట్టి యాతనికాలములో రాజధాని యుత్తరార్కాడు మండలములోని వేలూరునకు మార్పఁబడినట్లు కనఁబడుచున్నది. ఈహేతువుచేతనే యీ పట్టనమునకు రాయవేలూ రనుపేరు వచ్చినది.

వసుచరిత్రకాలమునకును జంద్రభానుచరిత్రకాలమునకు నంతర మెంత గలదో చూతము. క్రీ. 1574-వ సంవత్సరమునకుఁ బూర్వమే తిరుమలరాయలరాజ్యకాలము ముగిసినందున నాతని కంకితము చేయఁబడిన వసుచరిత్రము క్రీ. శ. 1572-వ సంవత్సరప్రాంతమందుఁ బుట్టియుండెసనియు దీనిపిదప నించుమించుగా ముప్పదిసంవత్సరములకుఁ జంద్రభానుచరిత్రము పుట్టియుండుననియు నూహించుట సమంజసముగాఁ దోఁచుచున్నది.

వసుచరిత్రములోని కృతిపతి వంశావతారవర్ణన పద్యములంబట్టి తిరుమలదేవరాయల రాజ్యకాలమందు శ్రీరంగరాయలు యువరాజుగ నుండె ననియు,