శ్రీరస్తు
పీఠిక
చంద్రభానుచరిత్రమును రచించినకవి తరిగొప్పుల మల్లనమంత్రి. ఈతఁ డాఱువేలశాఖలోనివాఁడు. మధ్వమతస్థుఁడు. స్వతంత్ర కపిసగోత్రుఁడు. తండ్రి నృసింహుఁడు. తల్లి తిప్పాంబ. జన్మస్థాన మేదియో తెలియదు గాని కృతి రచించుకాలమునఁ జంద్రగిరి నివాసముగా నున్నవాఁడు. తనకృతిని మాహురపురమునందు వెలసిన దత్తాత్రేయదేవున కంకితము చేసెను. ఈదేశమం దిప్పు డాఱువేలవారి నాఱువేలనియోగు లనుట యాచార మై యున్నది. ఈశాఖవారు గొందఱు పూర్వము కర్ణాటదేశమునకు వెళ్లి యచ్చట రాజకీయాదిపదవుల సంపాదించి ప్రసిద్ధి వడసిరి. వారిలోఁ గొందఱు మధ్యమత మవలంబించిరి. కావున వీరి నాఱువేలమాధ్వు లనవచ్చును. ఇట్టివా రిప్పుడును మైసూరురాజ్యమునం దనేకులు గలరు. సుప్రసిద్ధు లగు దివాను పూర్ణయ్యగారి కుటుంబము కూడ నిట్టిదే. వీరు వేఱు నాఱువేలనియోగులు వేఱు నని గ్రహించునది.
కాలనిర్ణయము — మల్లనకవి రాయనముగను నీతని యన్న యగు దత్తనామాత్యుఁడు ప్రధాని (కార్యకర్త) గను గర్ణాటప్రభువగు వేంకటపతిరాయలయాస్థానమందు నియుక్తు లయి యున్నట్లు గ్రంథమువలనఁ దెలియుచున్నది. ఈ వేంకటపతిరాయలు క్రీ.శ. 1586 మొదలుకొని 1614-వ సంవత్సరమువఱకు రాజ్యము చేసెను. ఈగ్రంథము 1600-వ సంవత్సరప్రాంతమున రచింపఁబడిన దని యూహింపవచ్చును.
వేంకటపతిరాయలకు వీరవేంకటపతిరాయ లను పేరు గూడఁ గలదు. ఈతఁడు వసుచరిత్రకృతిపతి యగు తిరుమలరాయల చతుర్థపుత్రుఁడు. తిరుమలరాయలు కృష్ణదేవరాయని యల్లుఁ డయిన యళియరామరాజు తమ్ముఁడు. వీరికి వేంకటాద్రి యనునొకతమ్ముఁ డుండెడివాఁడు. వీరు ముగ్గురును తుళువవంశపురాజులలోఁ గడపటివాఁ డగు సదాశివదేవరాయల మంత్రులును గార్యకర్తలుగ నుండిరి. క్రీ. 1565-వ సంవత్సరములో జరగిన తాళికోటయుద్ధములో