Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

నాళీకకాసారకేళీకలితనారినాళీకనత్తీరనాళికేర
మాలీనమకరందధూళీనతమిళిందకేళీనవానందశాలిరుంద
మేలాల తాలోలదోలాలసమరాళబాలాలఘుముదాలవాలసాల
మాలాపయుగనంగఖేలాపరవశాంగలీలాపరవిహంగజాలరంగ
మమరవరతనుకరతనునమితసుమిత, మునితకలరనకులరవముఖరశిఖర
తిలకసురుచిరతరుచరగళితలలిత, మధురమధురసపాళి యాకుధరమౌళి.

51


చ.

ఉరుతరకందరానిపతితోత్పతదంబుఝరీలవంబులం
బరఁగు నుదగ్రఘోషమయి పాపవినాశన మానగంబు సొం
పరయఁగఁ గోరి యేపతితులైన జడాకృతు లేగుదెంచినన్
సరసత నూర్ధ్వలోకము లొసంగుదు నే నని తెల్పుకైవడిన్.

52


సీ.

కమలాకరతఁ దామ యమరు నింతియ కాని క్రుంకువారికి సిరు ల్గూర్పఁగలవె
కువలయోద్ధతిఁ దామ కొఱలు నింతియకాని చేరువారికి ధరఁ జేర్పఁగలవె
యుత్కళికలఁ దాము యొప్పు నింతియకాని కనువారికి ముదంబు లునుపఁగలవె
యమృతసంగతిఁ దామ యలరు నింతియకాని తలఁచువారికి ముక్తిఁ దార్పఁగలవె
యితరతీర్థంబు లెందైన నీసరంబు
పగిది నని విశ్వభూజను ల్వొగడ నన్న
గమునఁ [1]జెన్నొందు స్వామిపుష్కరిణి యచటఁ
దాన మొనరించి యుచితకృత్యములఁ దీర్చి.

53


[2]క.

వారాహమూర్తికి నమ, స్కారం బొనరించి సంతసంబునఁ దత్త్కా
సారంబు వెడలి మురహరు, నారాధింపంగఁ దలఁచి యటఁ జన నెదుటన్.

54


సీ.

ప్రాకారఖచితహీరప్రభాచయదేవతాధునీబుద్బుదత్తారకంబు
గోపురేంద్రోపలాంకూరవిభాజాలయమునారథాంగదహస్కరంబు
కేతుగోమేధికద్యోతసరస్వతీహ్రాదినీశైవలదభ్రతలము
శిఖరాబ్జరాగరోచిఃప్రతానహిరణ్యవాహోత్సలన్నీలవారిదంబు
భక్తలోకైకభరణంబు పరమమౌని, కలుషసంతానహరణంబు ఘటితసుజన
నిచయసంసృతితరణంబు నిర్జరశర, ణంబు వేంకటపతిశరణంబు దనరె.

55


గీ.

అట్టిమురవైరినగరికి నరుగుదెంచి, వితతభక్తిఁ బ్రదక్షిణవిధు లొనర్చి
యావరణదేవతల నెల్ల ననుసరించి, గర్భగృహమున కేగి యుత్కంఠ మెఱయ.

56
  1. చ-చెలువొందు
  2. ట-లో నిదియుఁ బైపద్యమును లేవు.