Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

చకచకలు గలుగు నలిమే, చకకచ లిరుగడలఁ గలుగు సౌధశిఖావీ
థికలు గనుఁగొనుచుఁ దత్పుర, నికటోర్వికి వచ్చి యుపవనీభాగమునన్.

44


సీ.

చేమాకుతాళము ల్చెలఁగ రొండులఁ జేతు లుంచి యందఱ వెక్కిరించికొనుచుఁ
బజ్జధూపమున దీపపుఁగోల రాజహస్తము సాఁచి జేగంట చఱచికొనుచుఁ
దల యోరగిలఁ గ్రుంగి తప్పెట గతికి వాయించి గంగెడ్ల నాడించుకొనుచుఁ
దిరువడిసానుల బెెరసి గంటలు మ్రోయ బోడచప్పరముల నాడికొనుచుఁ
ద్రోవఁ గూర్చుండి [1]బొంతలు మ్రోలఁ బఱచి
ముదురుటెండల కోరగా ముసుఁగుఁ జేర్చి
పట్టెదండలు మొఱయించి పాడుకొనుచు
నలరు దాసళ్ల వీక్షించి యాక్షణమున.

45


గీ.

పంకజేక్షణు మురవైరి భక్తసులభు, వేంకటస్వామి వీక్షించువేడ్క హృదయ
పదమునఁ దొంగలింప సంభ్రమము మెఱసి, యామహీధర మెక్కితి నట్టివేళ.

46


[2]సీ.

చెక్కుల మకరికాచిత్రము ల్గరఁగంగఁ గలయమార్చుచు సారె నిలిచినిలిచి
కటులభారమున వెన్కకు వీఁగి యందంద [3]పతులయంసము లూఁత పట్టినట్టి
తరులనీడలు చేరనరిగి నెచ్చెలి వీచు సురటితెమ్మెరలకుఁ జొక్కి చొక్కి
పాదాబ్జములు తొట్రుపడఁగ జానువు లూఁది యెక్కుడుదగ మెట్టు లెక్కి యెక్కి
వలుదగుబ్బలఁ జెమటలు వడియఁ బయట
లుబ్బ నొత్తుచు నుస్సని యూర్చియూర్చి
యలఁతఁ దూలుచు వ్రాలుచు నలఘుహర్ష
జలధిఁ దేలుచు సోలుచు జలజముఖులు.

47


ఉ.

మందలు గూడి యెక్కి రతిమంజులవంజులకుంజమంజరీ
బృందమరందబిందులహరీబహురీతిసగీతినందదిం
దిందిరవందితుందిలనుతిప్రతికూజదళిందకందరా
మందనరజ్ఝరీఘుమఘుమధ్వనిజాలము శేషశైలమున్.

48


క.

తళతళన వెలుఁగు నిందూ, పలఫలకవనీపతత్ప్రబలబహులహరీ
సలయఝరీవలయదరీ, నిలయసరీసృపఫణామణిద్యుతు లచటన్.

49


గీ.

శబరకాంతాకుచాగ్రసంసక్తగైరి, కాంకనంబులు జనుల నఱ్ఱాఁచు నచట
ధాతుకృత్యంబు లౌట చిత్రంబె వాని, కతనుభావార్హకర్మశక్యప్రవృత్తి.

50
  1. చ-జటలు
  2. ట-లో లేదు.
  3. జ-వరులయంసము