Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

చంద్రభానుచరిత్రము

పంచమాశ్వాసము

క.

శ్రీయోగ [1]స్త్రీయోగప, గాయితరోమాంచభూషణనిరీక్షణ యా
మ్నాయమయభాషణ కృతా, ధ్యాయస్మృతరూపధేయ దత్తాత్రేయా.

1


వ.

అవధరింపు మాసమయంబున.

2


సీ.

పరవాహినీవిజృంభణము మానుచు మేటి నిర్ణిద్రశరసమున్మేషవేది
చనుదెంచు రాజహంసముల నేలెడుఱేఁడు కువలయమోదానుకూలవృత్తి
కమలాధివాసమై కనుపట్టుగుణశాలి మిత్రనిర్వ్యాజలక్ష్మీవిధాయి
సత్పరంపరకుఁ దేజంబు గూరుచుపెద్ద యతులవిధుప్రసాదైకపాత్ర
మఖలభువనంబుపంకంబు లడఁచుసుకృతి, సకలఫలవైభవంబు లొసంగుదాత
చంచలారంభములు లేనిచారుమూర్తి, జగతి మించె శరత్కాలచక్రవర్తి.

3


చ.

సరసవనాంతరాళవికసద్విషమచ్ఛదధూళికాపరం
పరలు మరుత్ప్రచారములఁ బైపయి నంబరవీథిఁ బర్వి పాం
డరజలదప్రకాండము లనంగఁ గనుంగొననయ్యెఁ గానిచో
గరిమ వహించునే యవి జగజ్జనరూఢసితాభ్రసంజ్ఞలన్.

4


చ.

సరసిజపాంసుసంవలితసైకతము ల్విలసిల్లునేఱులన్
శరదృతుభర్త నీరమయశాటిఁ దెరల్చినఁ జంద్రకావియ
స్తరులమఱుంగులం దగునితంబములో యనఁ బ్రాంతసీమఁ ద
త్కరనఖరాంకరేఖ లనఁగాఁ దెరతాఁకుడుజాడ లింపగున్.

5


మ.

అకరు ల్నిప్పులు తావిపుప్పొడి సముద్యద్దూపచూర్ణంబు కే
ళికరాళీప్రకరంబు, ధూమము మరాళీపక్షము ల్తాలవృం
తకము ల్గాఁ దగు రాజహంసతతిచెంతం బద్మిను ల్పూనుధూ
పకరండంబులువోలె సామిదళితాబ్జంబుల్ సరోవీథులన్.

6


క.

శరములు గావున మీఁద, న్నురువులు నెలకొల్పె ననఁగ నుతిఁ గని హరిదం
తరములఁ బూచినకనుములు, వరఁగె న్వలరాజు జల్లిబల్లెము లనఁగన్.

7
  1. చ-ట-శ్రీయోగ