Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తరళిక చంద్రభానునకుఁ గంకణము నిచ్చుట

గీ.

దేవ [1]చిత్తేశు సాత్రాజితితనయ........కాంతికుముదిని నిజకరకంకణంబు
ననిపె దేవర కిదె దీని నవధరింపు, మనుచుఁ బ్రాంజలి యైన నయ్యవనిభర్త.

120


క.

వితతాశ్చర్యతరంగిత, మతియై యాలేమచేతిమణిమయవలయం
బతిమోదంబునఁ గైకొని, స్మితమంజులవాక్యసరణిచే ని ట్లనియెన్.

121


శా.

రాగాంకూరలతాలవాలమవొ దౌర్భాగ్యాక్షరాక్షేపణో
ద్యోగాధిష్ఠితకుండలాకృతివొ [2]హృద్యుక్తాంగనాధైర్యసం
ధాగాఢాంగజదత్తవాగురవొ లేదా మత్తమో[3]రాహువుం
బ్రాగల్భ్యంబునఁ [4]ద్రుంచుచక్రమువొ భామాకంకణగ్రామణీ.

122


క.

మణిబంధబంధురస్థితి, మణిబంధనవాధివాసమహిమ మెఱయు నిం
బ్రణుతించెద ననుఁ గన్యా, మణిబంధుం జేయవే సమంచితకరుణన్.

123


క.

చెలువ మతితెఱఁగు నాతోఁ, బలికి కలఁక నడఁతు ననుచుఁ బఱతెంచితివౌ
వలయ ప్రకోష్ఠవాసికి, [5]నలవడు నీమదికిఁ దెలియు నంతర్వార్తల్.

124


చ.

అగణితమన్మథాశుగమహాజ్వలితానలమామకీనహృ
ద్ద్విగుణితతాప మెంచదొ మది న్మహిభృద్వరజాత యాసమ
గ్రగుణకలాప సింధుమణి గానియెడన్ ఘనసారయుక్తిఁ జె
న్నగు విషులోర్మికం బనుప కంపునె ని న్నొకకంకణాకృతిన్.

125


చ.

తొలువలఱాచకయ్యమునఁ దొయ్యలి నీవికి నెగ్గు వేఁ దమిం
దలఁచిన నడ్డగించుకరతామరసంబునఁ గూడునిన్ను నే
నలఁకువబెట్టఁ గంకణమ నమ్ము భవద్రుచిం కాంతయంగముం
దెలియఁగఁ జేయుమేలు మది నిల్పెదఁ గీ లెడలింప నొక్కెడన్.

126


మ.

చెలి సంతోషముఁ గాంచునే సఖులకు న్సేమంబు సంధిల్లునే
లలనాపోషితశారికాశుకమరాళంబు ల్సుఖం బుండునే
సిలుగు ల్సూపునె పంచసాయకుఁడు రాజీవాక్షిపై రత్నభా
నిలయం భావలయంబ తెల్పు మని కన్నీరోడిక ల్గట్టఁగన్.

127


గీ.

వివశుఁ డైయున్న యమ్మహీవిభుని జేరి, శిశిరవస్తులచేఁ గొంత సేదఁ దేర్చి
తలిరుకెంజాయసురటిచే నలవరించి, యొయ్య విసరుచుఁ దరళికాయువతి పలికె.

128
  1. చ-ట-చిత్తేశ
  2. చ-హృద్యోషాదృఢీభావముద్రాగాఢోద్యదనంగపాశమవొ, ట-హృద్వేషాదృఢీభాగముద్రాగాఢోద్యమనంగపాశమవొ
  3. చ-ట-వైఖరిన్
  4. చ-బాపుచక్రమవొ
  5. చ-ట-నలవడునే నీకుఁ దెలియ నంతర్వార్తల్