Jump to content

పుట:క్రీడాభిరామము (ఎమెస్కో).pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

జోటీ! భారతి! ఆర్భటి న్మెఱయుమీ! చోద్యంబుగా నేను గ
ర్ణాటాధీశ్వరుఁ బ్రౌఢదేవ నృపతిన్, నాసీర ధాటీచమూ
కోటీఘోటకధట్టికాఖురపుటీకుట్టాకసంఘట్టన
స్ఫోటీధూతధరారజశ్చుళికితాంభోటిన్ ప్రశంసించెదన్.

88


సీ.

 డంబు సూపి ధరాతలంబుపైఁ దిరుగాడు
                        కవిమీఁదఁ గాని నా కవచ మేయ,
దుష్ప్రయోగంబుల దొరకొని చెప్పెడు
                        కవిశిరస్సునఁ గాని కాలు చాప,
చదివి చెప్పఁగ నేర్చి సభయందు విలసిల్లు
                        కవినోరు గాని వ్రక్కలుగఁ దన్న,
సంగీతసాహిత్యసరసవిద్యల నేర్చు
                        కవుల రొమ్ములఁ గాని కాల్చి విడువ,


తే.

దంటకవులకు బలువైన యింటిమగఁడఁ,
గవులవాదంబు విన వేడ్క గలిగెనేని
నన్నుఁ బిలిపింపు మాస్థానసన్నిధికిని,
లక్షణోపేంద్ర! ప్రౌఢరాయక్షితీంద్ర!

89


ఉ.

తక్కక, రావు సింగ వసుధావరుఁ డర్థుల కర్థ మిచ్చుచో,
దిక్కుల లేని కర్ణుని, దధీచిని, ఖేచరు, వేల్పు మ్రాకుఁ, బెం
పెక్కిన కామధేనువు, శిబీంద్రుని నెన్నెదు బట్ట! దిట్టవై,
కుక్కవొ ?నక్కవో? ఫణివొ? క్రోఁతివొఁ? పిల్లివొ? బూతపిల్లివో?

90


క.

తేలా కాయెను బోనము,
పా లాయెను మంచినీళ్ళు, పడియుండుటకున్
నేలా కఱవాయె, నిసీ!
కాలిన గురిజాల నిష్ట కామేశ! శివా!

91