Jump to content

పుట:క్రీడాభిరామము (ఎమెస్కో).pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథుని చాటు పద్యములు

సీ.

పలుతెఱంగుల రంగు పద్మరాగల వీణె
                        చకచక ప్రభల సాక్షాత్కరింప,
సొంపుతో రవ చెక్కడంపు ముంగర చాయ
                        పవడంపుమోవిపైఁ బరిఢవిల్ల,
విరిసి యోసరిలి క్రిక్కిఱిసిన చనుదోయి
                        బిగువున నెఱ రైక పిక్కటిల్ల,
నొసపరి యొయ్యారి ముసుగులో నెఱివేణి
                        కొమరాలి మూఁపున గునిసియాడ,


తే.

విరులతావియు, నెమ్మేని వెనుక కచ్చ,
ఫెళ ఫెళక్కను చిఱుఁ దొడల్, బెళుకు నడుము,
వలుఁద పిఱుఁదులు, కలికిచూపుల బెడంగు,
లొలయఁ గన్గొంటి, వేపారి కలువకంటి.

57


క.

అద్దిర కుళుకులు బెళుకులు!
నిద్దంపు మెఱుంగుఁ దొడల నీటులు గంటే?
దిద్దుకొని యేల వచ్చును,
ముద్దియ యీ నంబిపడుచు ముచ్చట దీఱన్.

58


చ.

వడిసెల చేతఁ బట్టుకొని, వావిరి చక్కనిపైఁట జాఱఁగా,
నడుము వడంకఁగాఁ, బిఱుఁదు నాట్యము సేయఁగఁ, గొప్పు వీడఁగా,
దుడదుడ మంచె యెక్కె నొక దొడ్డమిటారపుఁ గమ్మ కూఁతురున్
దొడదొడ మంచ మెక్కె నొక దొడ్డమిటారపు రెడ్డి కూఁతురున్.

59


ఉ.

అంగడివీథిఁ బల్లవుల కాసగ మామిడిపండు లమ్ముచున్
జంగమువారి చిన్నది పిసాళితనంబునఁ జూచెఁ బో! నిశా
తాంగజ బాణ కైరవ సితాంబుజ మత్త చకోర బాల సా
రంగ తటిన్నికాయముల రంతులు సేసెడు వాఁడిచూపులన్.

60