Jump to content

పుట:క్రీడాభిరామము (ఎమెస్కో).pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

కృకాటికానికటచేటికానుయాత యగు కర్ణాటాంగనం
గనుంగొని,

⁠ 85


మ.⁠

[1]కుసుమం బెట్టిన చీరకొంగు వొలయన్, గ్రొవ్వారుపాలిండ్లపైఁ
ద్రిసరంబుల్‌ పొలుపార, వేణి యవటూదేశంబుతో రాయ, న
ప్పస మెవ్వాఁడొ యొకండు రాత్రి సురతప్రౌఢిం దనుం దేల్చినన్‌,
వసివా ళ్వాడుచు వచ్చుచున్నయది కర్ణాటాంగనం జూచితే?

⁠ 86


తే.⁠

వాహకుం డెక్కి విడిచిన వారువంపుఁ
గొదమయును బోలి, రతికేళి మదము డిగ్గి,
యలసభావంబుతోడఁ గర్ణాటవేశ్య
వచ్చుచున్నది యదె విప్రవర్య! కంటె?

⁠ 87


ఉ.⁠

ఈమరి, యింక నొక్కమరి, యింకొకమా, ఱిఁకనొక్కమాఱు, ‘నా
నోములపంటగా!’ యనుచు [2]నోవులఁ బెట్టుచు, రే యొకండు నా
ల్జాములు దీనితోఁ గుసుమసాయకతంత్రము సల్పఁబోలు, లే
దా మృగశాబనేత్ర యఖిలాంగకముల్‌ వసివాళ్ళు వాడునే?

⁠ 88

కర్ణాటభామతో మంచనశర్మ సంవాదము

వ.⁠

అనిన, మందస్మితంబుతో గోవింద మంచనశర్మ నర్మగర్భంబుగా
దర్భాంకురాలంకృతంబు లగు తన కరపంకజంబులం గర్ణ
పుటంబులు ముట్టుకొని, పూతిమాషగోత్రంబును మంచన
నామధేయంబునుం జెప్పి, నమస్కరించి యి ట్లనియె:

⁠ 89


శా.⁠

పంచారించిన నీ పయోధరము లాస్ఫాలింతునో? లేఁతబొ
మ్మంచుం గెంజిగురాకుమోవి ణిసిధాత్వర్థం బనుష్టింతునో?
పంచాస్త్రోపనిషద్రహస్యపరమబ్రహ్మస్వరూపంబు నీ
కాంచీదామపదంబు ముట్టుదునొ? యో కర్ణాటతాటంకిణీ!

⁠ 90
  1. ↑ చూ. శ్రీనాథుని వీథి. ప. 13)
  2. ↑ నోడల (మూ.ప్ర.)