పుట:కొప్పులింగేశ్వరశతకము (కూచిమంచి సోమసుందరుఁడు).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14


మ.

అమరంగా నొకసారె తజ్జపము సేయన్ బ్రహ్మహత్యాదిఘో
రమహాఘంబులు వీగిపారు సకలార్థశ్రేణి చేకూరు ను
త్తమనిర్వాణముఁ జేరు నెంతయు భవత్పంచాక్షరీమంత్రభూ
రిమహత్త్వంబు గణింప బ్రహ్మతరమా శ్రీ...

55


శా.

కామక్రోధముఖాంతరంగరిపులన్ ఖండించు నుద్యన్మహో
ద్దామాపత్తమమున్ హరించుఁ బరతత్వప్రాభవాంచత్పరం
ధామావాప్తి ఘటించు నెంతయు భవన్నామమ్ము సర్వోన్నత
క్షేమస్థాన మశేషలోకములకున్ శ్రీ...

56


శా.

పాపారణ్యదవానలం బఖిలసంపద్వల్లికాచైత్ర ము
గ్రాపత్పర్వతవజ్రమిష్టఫలకల్పాగంబు సంసారసం
తాపచ్ఛేదసుధారసంబు నిగమాంతక్ష్మానిధానంబు నీ
శ్రీపాదాంబుజభక్తికన్నఁ గలదా శ్రీ...

57


శా.

ముద్రాభ్యాసనిరూఢి నొంది మునిరాణ్ముఖ్యు ల్సమాధిస్థితిన్
భద్రస్ఫూర్తి తదేకలక్ష్యపరతన్ భావింప నుద్భూతమై
హృద్రాజీవసుకర్ణికాంతరమునం దింపారు తేజంబు నీ
చిద్రూపం బని చెప్పుచుందురు బుధుల్ శ్రీ...

58


శా.

జారుండైనను చోరుఁడైనను దురాచారుండునైన న్మహా
క్రూరుండైనను భక్తి నొక్కపరి నీకున్ మ్రొక్కిన న్వారలన్
సారోదారకృపాకటాక్షశుభవీక్షారూఢి నీదగ్గఱన్
జేరందీసి వరంబు లిచ్చెదుగదా శ్రీ...

59