పుట:కొప్పులింగేశ్వరశతకము (కూచిమంచి సోమసుందరుఁడు).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

శుంభతయరాఘవాదులకు నెచ్చోదాటరానట్టియ
య్యంభోధిన్ దగ నొక్కగ్రుక్క గొనె నాహా కుంభజన్ముండు ని
ర్దంభప్రౌఢిమలీల మీఱఁగ భవద్భక్తప్రభావంబు ల
ర్థిం భాషాపతికైన నెన్న వశమా శ్రీ...

50


మ.

హరి నేత్రాబ్జముతోడ నీకొగి సహస్రాబ్జంబు లర్పించి తా
సరగన్ నీదుసుదర్శంనంబు గొను టాశ్చర్యంబె వెయ్యేల హృ
త్సరసీజంబొకటే త్వదర్పితమునొందన్ జేయువాఁ డెల్లఁ జె
చ్చెర నీదివ్యసుదర్శనంబు గనుచో శ్రీ...

51


శా.

రంగౌ మేలతనంపుసొమ్ములు మణీరాజత్ఫణాంచత్ఫణుల్
రంగన్మౌళితలస్రజంబు సుమనోరమ్యాపగారత్న మెం
చంగా నంగవిలేపనం బతనుభాస్వద్భూతియై యొప్పునీ
శృంగారంబు మహాద్భుతంబుగదరా శ్రీ...

52


మ.

చిరకాలంబు భజింపకున్న వరము ల్చేకూర్ప రేవేల్పులున్
గరిమన్ నీకొకసారి మ్రొక్కిన నుదత్కాలంబునందే సిరుల్
దొరయన్ గోరికలెల్ల నిత్తువఁట యెందున్ లేరు యుష్మాదృశా
చిరసంరూఢదయాప్రసన్నహృదయుల్ శ్రీ...

53


మ.

భవదారాధనకున్ ఫలం బనుచు నాబ్రహ్మేంద్రలోకాదివై
భవము ల్నీ వొగి నిచ్చెదేమొ యవి నీపాదార్చకు ల్మెత్తురే
శివ నీశాశ్వతయోగసౌఖ్యజలరాశిన్ బిందువు ల్చూడ వా
రివిభుత్వంబు లవేల మాకు ననుచున్ శ్రీ...

54