Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దినచర్య వృత్తాంతాలు, లేఖకులకు చెప్పి వ్రాయించినవి, ఉత్తరాలు

165

భూమిమీద జీవిస్తున్న ప్రాణులంటే మనకి కనికరం వున్నదా?

నది పక్కనే ఒక చెట్టు వుంది. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ సరిగ్గా సూర్యుడు వుదయించబోయే సమయాన ఆ చెట్టువైపే చూస్తూ కూర్చుంటున్నాము. దిగంతంలో సూర్యబింబం వుదయించి చెట్లమీదుగా మెల్లగా పైకిలేస్తూ వుంటే, యి చెట్టు అకస్మాత్తుగా బంగారం రంగును పులుముకుంటుంది. ఆకులన్నీ ప్రాణం పోసుకున్నట్లు మెరిసి పోతుంటాయి. ఆ చెట్టు పేరు ఏదయితేనేం - మనం చూస్తున్నది ఆ చెట్టు సౌందర్యాన్ని - అటువంటి ఆ చెట్టువైపు గంటల తరబడి కూర్చుని చూస్తూ వుంటే, ఒక అనిర్వచనీయమైన గుణతత్వంతో ఆ ప్రదేశం, ఆ నది ఆవరించుకొనిపోయినట్లుగా అనిపిస్తుంది. సూర్యుడు యింకొంచెం పైకి ఎక్కి రాగానే, ఆకులన్నీ గలగలమంటూ కదిలి నృత్యం చేయడం ఆరంభిస్తాయి. గంట గంటకూ ఆ చెట్టు ఒక కొత్త శోభతో మెరిసి పోతున్నట్లుగా అనిపిస్తుంది. సూర్యోదయం అవక ముందు కనిపించీ కన్పించకుండా, ఎక్కడో మనకి చాలా దూరంలో, నిశ్చలంగా నిలబడినట్లుండే ఆ చెట్టులో ఒక గాంభీర్యం కనబడుతుంది. రోజు గడిచినకొద్దీ, కాంతిని పైన పులుముకున్న ఆకులు నృత్యం చేస్తూ, గొప్ప సౌందర్యం అంటే యిదే సుమా అని అనిపించే ఒక ప్రత్యేకతను ఆ చెట్టుకు ఆపాదిస్తాయి. మధ్యాహ్న సమయానికి దాని నీడ బాగా చిక్కనవుతుంది. ఎండ బారిన పడకుండా హాయిగా అక్కడ కూర్చోవచ్చు. ఆ చెట్టు ఒక స్నేహితుడిలా తోడుగా వుండి, ఒంటరిగా వున్నామన్న భావన రానీయదు. అక్కడ కూర్చున్నప్పుడు, చెట్లు మాత్రమే యివ్వగలిగిన ఒక గాఢమైన, స్థిరమైన భద్రతాభావంతో కూడుకున్న బాంధవ్యమూ, స్వేచ్ఛా మనకు దొరుకుతాయి.

సాయంత్రం అస్తమిస్తున్న సూర్యుడు పడమటి ఆకాశాన్ని ఎర్రగా వెలిగించి నప్పుడు, చెట్టు క్రమక్రమంగా కాంతిహీనంగాను, అస్పష్టంగాను అయి, తరువాత పూర్తిగా చీకట్లో మునిగిపోతుంది. ఆకాశం ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లోకి మారుతుంది. కాని చెట్టు మాత్రం చలనం లేకుండా వుండిపోయి అదృశ్యమవుతుంది. ఇక రాత్రి అంతా విశ్రాంతి తీసుకుంటూ వుండిపోతుంది.

ఆ చెట్టుతో కనుక ఒక బాంధవ్యం ఏర్పరచుకుంటే మొత్తం మానవాళితోనే బాంధవ్యం ఏర్పరచుకున్నట్లవుతుంది. అప్పుడు ఆ చెట్టు బాధ్యత, లోకంలో వున్న చెట్ల బాధ్యత మీదే అవుతుంది. భూమిమీద జీవిస్తున్న ప్రాణులతో మీకు ఏ బాంధవ్యమూ లేనప్పుడు, మనుష్యులతో, యీ మానవాళితో మీకు వుండే ఆ కాస్త బాంధవ్యమూ కూడా కోల్పోతారు. చెట్టు యొక్క గుణం ఏమిటి అని మనం ఎప్పుడూ లోతుగా పరికించి చూడం. చెట్టుని, దాని దృఢత్వాన్ని గరుకుగా వుండే దాని బెరడుని