Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

కృష్ణమూర్తి తత్వం

తాకి చూసి అనుభవపూర్వకంగా తెలుసుకోము. చెట్టు వినిపించే ధ్వనులని వినం. గాలి చెట్ల ఆకుల్లోంచి వీస్తూ చేసే ధ్వనులని కాదు; పిల్లగాలుల చప్పుళ్ళనీ కాదు. అచ్చంగా చెట్టులోనే వున్న ధ్వనులని. చెట్టు మొదలు వినిపించే ధ్వనులని, చెట్టు వేళ్ళు మౌనంగా వినిపించే ధ్వనులని. ఆ ధ్వనులు వినాలంటే మీలో అసాధారణమైన సున్నితత్వం వుండాలి. అది యీ ప్రపంచం చేస్తున్న గోల వంటిది కాదు. అదేపనిగా వాగుతూ వుండే మనసు చేసే గోల వంటిదీ కాదు, తమ కలహాలతోను, యుద్దాలతోను మనుష్యులు సృష్టిస్తున్న అసహ్యమైన గోలా కాదు. ఈ విశాల విశ్వంలోని ఒక భాగం అయిన ధ్వని యిది.

ప్రకృతితో, కీటకాలలో, ఎగిరి దుమికే ఆ కప్పతో, కొండల మధ్యన తన జత పిట్టను పిలుస్తూ, కూస్తున్న గుడ్లగూబలో మనకి యింత తక్కువ బాంధవ్యం వుండటం ఎంతో వింతగా అనిపిస్తున్నది. భూమిమీద అసంఖ్యాకంగా వున్న యీ ప్రాణులంటే మనకి ఏమాత్రం లక్ష్యం లేదు. ప్రకృతితో కనుక మనం ఒక గాఢమైన, స్థిరమైన బాంధవ్యం ఏర్పరచుకోగలిగినప్పుడు, మన ఆకలి తీర్చుకోవడం కోసం జంతువుల్ని చంపడానికి చేతులు రావు. స్వప్రయోజనాల కోసం కోతుల్ని, కుక్కల్నీ, గీనీపందుల్నీ కోసి, పరీక్షించి, వాటిని చిత్రవధ చేయలేము, మన గాయాలు మాన్చుకోడానికి, మన దేహాలకి చికిత్స చేసుకోవడానికి యింకో రకమైన మార్గాలని వెతుక్కుంటాము. అయితే మనసుకు చికిత్స చేసుకోవడం అనేది దీనికి పూర్తిగా భిన్నమైనది. ప్రకృతితో మీరు వుండిపోతే, ఆ చెట్టుమీద వున్న నారింజకాంతితోను, సిమెంటులో నుంచి పొడుచుకొని వచ్చిన ఆ గడ్డిపోచతోను, మబ్బులు కమ్మివేసి, అదృశ్యం చేసిన ఆ కొండలతోను మీరు వుండిపోతే, అప్పుడు క్రమక్రమంగా మనసుకు నయమవుతుంది.

ఇది భావుకత్వం కాదు, కాల్పనిక లోక విహారమూ కాదు. ఈ భూమిమీద జీవిస్తున్న, సంచరిస్తున్న ప్రతి ప్రాణితోను మనకు వుండవలసిన బాంధవ్యం అనే ఒక నిజం. లక్షలాది సొరచేపలను మనిషి చంపేశాడు. ఇంకా చంపుతూనే వున్నాడు. వాటిని వధించడం ద్వారా పొందే ప్రయోజనాలన్నీ యితర విధానాల ద్వారా కూడా పొందవచ్చు. కానీ మనిషికి చంపడంలో - పరుగెత్తిపోతూ క్షణంలో కనుమరుగయ్యే జింకను, వుత్సాహంగా వురకలు పెడుతున్న లేళ్ళను, గజరాజులు ఏనుగులను - చంపడంలో ఏదో సంతోషం వున్నట్లుగా కన్పిస్తున్నది. మనకి ఒకరి నొకరం చంపుకోవడం అంటే కూడా యిష్టమే. ఈ భూమిమీద మానవుడి చరిత్ర ఆరంభమైన నాటినుండీ యీ రోజువరకు తోటి మనుష్యులను చంపడం అనేది సాగుతూనే వున్నది. ప్రకృతితో, చెట్లతోనే నేరుగాను, పొదలతోను, పూలతో, గడ్డితో, బిరబిరమని కదిలిపోయే