Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

కృష్ణమూర్తి తత్వం


ప్రశ్న : అపరిమితమైన ఆవేదన, నైరాశ్యం నన్ను అలముకున్నప్పుడు, నా ప్రయత్నం ఏదీ లేకుండానే ఎవరో తెలియని ఆ పైవాడికి నన్ను నేను పూర్తిగా అర్పించుకుంటాను. ఆ విధంగా నాలో నిస్పృహ తొలగిపోతుంది. ఇదే లేకపోతే నేను సర్వనాశనమైపోయి వుండేవాడిని. ఈ సమర్పణ అనేది ఏమిటి, యిట్లా చేయడం తప్పా?

కృష్ణమూర్తి : బుద్ధిపూర్వకంగా ఏదో తెలియని ఒకదానికి మనసు తన్ను తాను అర్పించుకోవడం సరియైన పద్ధతి కాదు. ఇది కూడా ప్రేమ, నమ్రత లేని మనిషి ప్రయత్నపూర్వకంగా ప్రేమని, నమ్రతని అలవరచుకోవడం లాంటిదే. నాలో హింస వున్నది, అహింసాత్మకంగా అవాలని నేను ప్రయత్నిస్తున్నంత మాత్రాన నాలో హింస లేకుండా పోదు. నేను వినయంగా ప్రవర్తిస్తూ వుంటే నాలో నిజంగా నమ్రత వున్నట్లా? అట్లా ప్రవర్తించడాన్ని మర్యాద అంటాం. అది నమ్రతకాదు. ఇందులోని నిజం మీకు కనబడుతున్నదా? అబ్బ, చాలా తెలివైన మాటలు, ఎంతో చమత్కారంగా చెప్పారు. అని ప్రశంసించకండి. ఇందులో వున్నది చమత్కారం కాదు. ఉద్దేశ్య పూర్వకంగా తనని తానే మంచిగా వుండమని ప్రోత్సహించుకునే వ్యక్తి చేస్తున్నదీ, దేవుడు అని తను పేరు పెట్టుకున్న వాడికి, ఆ పైవాడికి తన్ను తాను సమర్పించుకునే వ్యక్తి చేస్తున్నదీ- బుద్ధి పూర్వకంగా, తమ యిచ్ఛానుసారం చేస్తున్న ఒక సంకల్పక్రియ. అటువంటి సమర్పణ సమర్పణ కాదు. అది తనను తాను మరచిపోవడం, మరొకర్ని తెచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టడం, భర్తీ చేయడం, ఒక విధమైన పలాయనం, తనని తానే సమ్మోహ పరచుకోవడం లాంటిది, మాదక ద్రవ్యాలు తీసుకోవడం లాంటిది, అర్ధంలేని మంత్రాలను పునశ్చరణ చేయడం లాంటిది.

బుద్ధి పూర్వకంగా చేసేది కానటువంటి సమర్పణ కూడా ఒకటి వున్నది. అందులో అణుమాత్రం కూడా కోరుకోవడం, కావాలనుకోవడం వుండవు. మనసు ఒత్తిడి చేయడం వలన చేస్తే అది సమర్పణ కాదు. శాంతి కావాలనీ, నేను దేవుణ్ణి ప్రేమిస్తాను, దైవప్రేమే నా లక్ష్యం' అనీ మనసు అంటే అది ప్రేమ కానే కాదు. మనసు బుద్ధిపూర్వకంగా చేసే కార్యకలాపాలన్నీ మనసు ఎడతెగకుండా కొనసాగడానికి తోడ్పడుతుంటాయి. కొనసాగింపు వున్నదెప్పుడూ కాలంతో కలసివుంటుంది. కాలం అంతమైనప్పుడే సత్యమైనది వునికిలోకి రాగలుగుతుంది. మనసు సమర్పణ చేసుకోలేదు. మనసు చేయగలిగిందల్లా నిశ్చలంగా వుండటం, అయితే ఆశ వున్నా,